Mahabubabad, Oct 23: మహబూబాబాద్ దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు (Mahabubabad Minor Murder Case) రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. ఏడాది నుంచి నిందితుడు డింగ్ టాక్ యాప్ వాడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్ చేశాడు. పెట్రోల్ బంక్‌కు వెళ్దామని బాలుడిని మందసాగర్ తీసుకెళ్లాడు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే బాలుడు సాగర్‌తో వెళ్లాడు.
ఈ క్రమంలోనే మంచి నీళ్లలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో నిందితుడు తాగించాడు. బాబు స్పృహలోకి వచ్చేలోపే హత్య (Dikshit Reddy murder Case) చేసేశాడు. ఆ తరువాత డింగ్ టాక్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు ఫాలో అవుతున్నారని అనుమానంతో.. బాలుడి తండ్రి రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణాన్ని మంద సాగర్ నడుపుతున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గుర్తుపడుతాడనే భయంతో బాలుడిని గొంతునులిమి చంపాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి (SP Koti Reddy Press Meet) వెల్లడించారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే దీక్షిత్‌ని హత్య చేశాడని చెప్పారు.
మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి ఓ టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)ని ఎవరో గుర్తితెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇట్టి కిడ్నాప్ గురించి బాలుని తల్లిదండ్రులు మహబూబాబాద్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేయగా.. మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించాం. నిందితుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతి తొందరలో డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచి బాలుడిని తీసుకెళ్లాడు. తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి కొద్దిసేపు గడిపాడు.
బాలుడిని కంట్రోల్ చేయడం మంద సాగర్‌కు కష్టంగా మారింది. దొరికిపోతాననే భయంతో దీక్షిత్‌ను గొంతు నులిమి చంపాడు. అనంతరం రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. చంపిన తర్వాత రెండు రోజుల పాటు ఫోన్లు చేస్తునే ఉన్నాడు. సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్ కోసం గాలించాం. 30 మంది అనుమానితులను ప్రశ్నించాం. కిడ్నాపర్ వాడిన టెక్నాలజీతోనే నిందితుడిని పట్టుకున్నాం. మంద సాగర్ ఒక్కడే దీక్షిత్‌ను హత్య చేశాడు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటూ సైబర్‌క్రైమ్ పోలీసులు దీక్షిత్ కేసు విషయంలో.. రంజిత్ భార్యకు సాగర్ చేసిన ఫోన్‌కాల్ వివరాలను గూగుల్ ప్లేస్టోర్‌లో గుర్తించిన టాప్-10 కాల్‌స్పూఫింగ్, ఫోన్/మెసేజింగ్ యాప్‌లకు పంపారు. ఆయా యాప్‌ల యాజమాన్యాలకు వివరాలు తెలియజేశారు. దీంతో.. ‘డింగ్‌టోన్’ యూజర్ ఖాతా వివరాలను అందజేసింది. అయితే..నిందితుడు మందసాగర్ తన స్నేహితుడి మొబైల్ నంబర్‌తో ఆ యాప్‌లో రిజిస్టర్ అయ్యాడు. దీంతో.. పోలీసులు తొలుత సాగర్ స్నేహితుడిని పట్టుకుని విచారణ జరిపారు. ఆ తర్వాత మంద సాగర్‌ను గుర్తించారు.దీక్షిత్ ఉదంతం తర్వాత కాల్‌స్పూఫింగ్, ఇంటర్నెట్ ఫోన్‌కాల్ యాప్స్ నిషేధంపై తెలంగాణ పోలీసులు దృష్టిసారించారు.