BRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

Hyderabad, JAN 28: రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై బీఆర్ఎస్ (BRS) పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ద‌మ్ముంటే, చేత‌నైతే తెలంగాణ రావాల్సిన హ‌క్కుల‌ను కేంద్రం వ‌ద్ద‌ సాధించుకొని రా అని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు కేటీఆర్ స‌వాల్ చేశారు. ద‌మ్ముంటే పార్ల‌మెంట్ ర‌ద్దు చేసి ముంద‌స్తుకు రండి.. త‌ప్ప‌కుండా ముంద‌స్తుకు (Early Elections) అంద‌రం క‌లిసి పోదాం. ఎవ‌రేందో ప్ర‌జ‌లే తేలుస్తారు అని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన పెట్ట‌బోయే బ‌డ్జెట్ మోదీకి చివ‌రిది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవ‌ర్ని ప్ర‌పంచ కుబేరుల‌ను చేస్తున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌పంచం ముందు మీ బండారం బ‌య‌ట‌ప‌డుతుంది. పొద్దున్నే లేస్తే కేసీఆర్‌ను, మంత్రుల‌ను తిట్ట‌డం ప‌నిగా పెట్టుకున్నారు. కానీ మేం మాట్లాడటం మొద‌లు పెడితే మీ అయ్య‌లు, మీ తాత‌లు గుర్తువ‌చ్చేలా మాట్లాడే స‌త్తా మాకుంది. మీ కంటే బ్ర‌హ్మాండంగా మాట్లాడ‌గ‌లుగుతాం. ఇక‌నైనా స‌భ్య‌త‌తో మాట్లాడాల‌ని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు చెప్తున్నా. ఒక పెద్ద మ‌నిషి కొడుకువు. డీ శ్రీనివాస్ (D. srinivas) అంటే మా అంద‌రికీ గౌర‌వం ఉంది. పెద్దాయ‌న కొడుక‌వ‌ని ఊకుంటున్నాం. ఇంత సంస్కార‌హీనంగా మాట్లాడ‌కు. మేం కూడా మాట్లాడ‌గ‌లం కానీ.. మేం నీలా సంస్కారహీనులం కాదు.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ఇక‌పై ఊరుకోం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

కేంద్రం ప‌థ‌కాల‌కు కేసీఆర్ పేర్లు మారుస్తుండు అని ఒకాయ‌న అంటుండు అని కేటీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ (BJP) నాయకులకు స‌వాల్ చేస్తున్నాను. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో మీ ప్ర‌భుత్వాలే ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు ఉన్నాయా? మిష‌న్ భ‌గీర‌థ‌, రైతు వేదిక‌లు, ఇంటింటి ముందు న‌ల్లా వంటి ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాయా? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా? బెస్ట్ గ్రామ‌పంచాయ‌తీలు తెలంగాణ‌లోనే ఉన్నాయ‌ని మీరే అవార్డులు ఇస్తారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో మ‌న మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తారు. ఢిల్లీలో ఉండేవారేమో అవార్డులు ఇస్తారు.. గ‌ల్లీలో ఉండేవారేమో కారుకూత‌లు కూస్తారు. ప‌నికిమాలిన మాట‌లు మాట్లాడుతారు.. అయితే ఢిల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు.. లేదంటే గ‌ల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు. తెలంగాణ అభివృద్ధి న‌మూనా భార‌త‌దేశంలో ఎక్క‌డైనా ఉందా? అని కేటీఆర్ నిల‌దీశారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేసిండు అని ఒకాయ‌న అంట‌డు అని కేటీఆర్ గుర్తు చేశారు. 2014కు కంటే ముందు దేశంలో 14 మంది ప్ర‌ధాన‌మంత్రులు ప‌ని చేశారు. వీరు 67 ఏండ్ల‌లో చేసిన అప్పు రూ. 56 ల‌క్ష‌ల కోట్లు.. కానీ న‌రేంద్ర మోదీ ఈ 8 ఏండ్ల‌లో రూ. 100 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిండు. ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన మోదీ.. ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు. పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్ కోస‌మే మేం అప్పుల‌ను ఉత్పాద‌క రంగంలో పెట్టుబ‌డుల రూపంలో పెట్టాం. మేం మీలాగా కార్పొరేట్ దోస్తుల‌కు పంచి పెట్ట‌లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.