Sukesh and KTR (Photo-File Image)

Hyderabad, July 14: ఢిల్లీ మ‌ద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖ‌ర్‌కు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. త‌న‌పై త‌ప్పుడు విష‌యాల‌తో కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేశాడ‌ని కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపించారు. బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని, బేష‌ర‌తుగా త‌న‌పై ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవాల‌ని సుఖేష్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. భ‌విష్యత్‌లో త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేయొద్దని కేటీఆర్ సూచించారు. ఓ నేర‌గాడు, మోస‌గాడు అయిన సుఖేష్ అనే వ్యక్తి త‌న‌పై మ‌తిలేని ఆరోప‌ణ‌లు చేశాడ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక‌గా వెల్లడించిన విష‌యం తెలిసిందే.

సుఖేష్ ఆరోప‌ణ‌లు మీడియా ద్వారా త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. సుఖేష్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని మంత్రి స్పష్టం చేశారు. సుఖేష్ నిరాధార ఆరోప‌ణ‌ల‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటాన‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇలాంటి నిరాధార‌ణ ఆరోప‌ణ‌ల‌ను ప్రచురించే ముందు మీడియా కూడా జాగ్రత్తగా వ్యవ‌హ‌రించాల‌ని కేటీఆర్ సూచించారు.