Hyd, Oct 28: హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు (hasini attempt suicide) యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. హిమాయత్‌నగర్‌లో ఓ యువతి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఉరి బిగించుకుని ఆన్‌లైన్‌లో పోస్టు పెట్టింది. దానిని చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు.
అనంతరం ఆమెను హైదర్‌గూడా అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హాసిని క్షేమంగానే ఉంది. కాగా హాసిని 2018లో మిస్ తెలంగాణగా (Miss Telangana 2018) యువతి ఎంపికైంది.. ఇటీవలే ఓ యువకుడిపై శారీరకంగా వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో మొయినాబాద్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. అమ్మా..నేను చనిపోతున్నా..’ ఓ వివాహిత తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్‌కట్ చేసి చెప్పినంత పనిచేసింది. పెళ్లయిన పదకొండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన మొయినాబాద్ మండల చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన శ్రావణి (26)తో చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డి వివాహం గత సంవత్సరం నవంబర్ 27న జరిగింది.
పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబం వారు 40 తులాల బంగారం, రూ.40 లక్షలు నగదు, తూప్రాన్‌లో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన చుట్టుపక్కల వారు, ఆమె అత్త కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.