Warangal, July 07: వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiam Srihari) దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా జరగలేదన్నారు. ఎంతో మంది నియోజకవర్గ బిడ్డలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి కడియం అని రాజయ్య (MLA Rajaiah) వ్యాఖ్యానించారు. శుక్రవారం తాటికొండ గ్రామంలో జరిగిన ఆది జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరిని (Kadiam Srihari) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘టీడీపీ (TDP) హయాంలో ధర్మపురం సర్పంచి జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం లేదని జాఫర్‌గడ్ తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేస్తానని కొడితే ఆయన ఇప్పటికీ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. నిన్నటికి నిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లెపాటి సోమిరెడ్డి అనే రైతు భూవివాదంలో సైతం కలగజేసుకొని ఆయన్ను పోలీసుల సాయంతో ఇబ్బంది పెట్టారు. రిమాండ్ కు పంపించారంటే ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలి. మళ్లీ నియోజకవర్గంలో కక్ష సాధింపులు వివక్షలు మొదలయ్యాయి. దశాబ్ది ఉత్సవాలు ఎలా జరుపుకొన్నామో అలా కడియం శ్రీహరి వర్గం వారు నియోజకవర్గంలో అనేక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వెంటనే కడియం శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నియోజకవర్గంలో పార్టీ నిధులతో దొంగ చాటుగా సమావేశాలు నిర్వహించి ప్రొసీడింగ్ కాపీలు అందించడం సరికాదు.
కడియం శ్రీహరి తస్మాత్ జాగ్రత్త. నీతో తిరిగే వారందరూ బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించిన వారే. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీవ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే పోటీ చేయను అన్నాడు. మళ్లీ టీడీపీ నుంచి ఆయనే మొట్టమొదటి నామినేషన్ వేశాడు. కడియం శ్రీహరి ఇక నుంచి రోజూ నేను గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తా. ప్రతి గ్రామంలో డప్పు కొడతా నువ్వు కొడతావా.. నువ్వు తిరుగుతావా? నీ రాజకీయ చరిత్రలో ఒక్కరోజన్నా పల్లెనిద్ర చేశావా? అక్కడక్కడ దొంగ వీడియోలు ఆడియోలను పట్టుకొని బెదిరిస్తే భయపడను. కోర్టుకు వెళ్లి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు.