Formula E car race case update..ED officials' letter to Telangana ACB(X)

Hyderabad, DEC 20: ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ (Formula E Car Race) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ (ACB) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ (ECIR) నమోదు చేశారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR), అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Relief For KTR: హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్, ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం...తదుపరి విచారణ 27కు వాయిదా 

ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కోరారు.

ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.