రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకకోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభమైతే విత్తు నాటేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు రైతులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పొడి దక్కుల్లో విత్తునాటి తొలకరి వర్షాలకోసం వేచి చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలు, మధ్య మహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న 48గంటల్లో తెలంగాణతో పాటు ఏపీలోని కొన్నిప్రాంతాలు, పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు
అయితే తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే గత వారంతో పోల్చితే ఈ వారంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం గరిష్ఠంగా ఖమ్మంలో 41.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ఠంగా మెదక్ జిల్లాలో 24 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.