Nagarkurnool, JAN 12: సంక్రాంతి పండక్కి బట్టలు కొనివ్వలేదని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా (Mother Killed Children) చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య (Suicide) చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాంపూర్ చెంచుపెంటకు చెందిన చిన్న బయన్న పెద్దవాగు బేస్ క్యాంప్ వాచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బయన్నకు ఇద్దరు భార్యలు.. వీరిలో చిన్న భార్య నాగమ్మ(26)కు బయమ్మ(3), యాదమ్మ (1) సంతానం. సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుండటంతో కొత్త బట్టలు కొనివ్వాలని గురువారం బయన్నను నాగమ్మ అడిగింది.
అయితే కొత్త బట్టలు కొనేందుకు బయన్న నిరాకరించాడు. నాలుగు నెలలుగా జీతం రాకపోవడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నచ్చజెప్పాడు. కానీ బయన్న మాట వినిపించుకోకుండా నాగమ్మ మొండికేయడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. భార్య మొండిపట్టు భరించలేక బట్టలు కొందామని బయన్న మన్ననూరుకు వచ్చేశాడు. అప్పటికే భర్తతో పెద్ద వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన నాగమ్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. వెంటనే ఇద్దరు బిడ్డల గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఇంట్లోనే ఆమె కూడా ఉరేసుకుంది. కాసేపటికి స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ విగతజీవులై కనిపించారు.