తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, ఇక భవిష్యత్తు బీజేపీదేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా వద్దనుకుని ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకుంటున్నారని, అందుకే రాష్ట్రంలో బీజేపీ బలం నానాటికీ పెరుగుతోందని అన్నారు. గురువారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిందని, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.
‘‘తెలంగాణలో పదేళ్లలో 10 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ మాపై విష ప్రచారం చేసింది. అయినా ప్రజలు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా మా పార్టీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో కూడా ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజిగిలోనూ బీజేపీకి 4 లక్షల మెజార్టీ వచ్చింది. మెదక్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలకు బీజేపీకే పట్టం కట్టారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా.. 8 ఎంపీ స్థానాల్లో గెలిచాం. 7 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచాం. అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను కాదని ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసం చూపించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడై బీజేపీ పనిచేస్తుంది. ఇక భవిష్యత్తు మాదే’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.