Hyd, Oct 20: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugode Bypoll) గుర్తులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గుర్తుల విషయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఎన్నికల్లో గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని (CEC) స్పష్టం చేసింది.
కాగా, తాజాగా ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్ అయ్యింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని సీఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు మార్పును ఈసీఐ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని స్పష్టం చేసింది.ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకోవాలని.. నివేదికను సాయంత్రంలోపు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీఐ ఆదేశించింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో ఫారం 7(ఎ)ను ఎన్నికల అధికారులు సవరించారు. శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ నేపథ్యంలో మారిన గుర్తులతో బ్యాలెట్ ముద్రణకు చర్యలు చేపట్టనున్నారు.
తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తర్వాత బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్వోపై ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని గుర్తించినట్టు సీఈసీ పేర్కొంది.