Mynampally Hanumantha Rao (Photo-Video Grab)

Hyderabad, SEP 22: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanthao) బీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా హన్మంతరావును ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు (Hanumanthao resigns) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొద్ది సమయానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరా అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి (Malkajigiri) అభ్యర్థిగా ఆయన పేరు ఉండటంతో ఇదే విషయాన్ని విలేకరులు సీఎం వద్ద ప్రస్తావించారు. ‘టికెట్‌ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ ను వీడుతున్నట్టు మైనంపల్లి ప్రకటించారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు మెదక్ నుంచి మైనంపల్లి కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.