Hyderabad, January 8: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) తో న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ (Priyanca Radhakrishnan) ఈరోజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తెలంగాణలో అగ్రిటెక్, ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ కంపెనీల ఏర్పాటు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. న్యూజిలాండ్ ప్రభుత్వ మరియు పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు న్యూజిలాండ్ రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను, న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా, ఆఫీస్ స్థలాల లీజులు- లావాదేవీల (Office Space Transactions) విషయాల్లో హైదరాబాద్ నగరం బెంగళూరును అధిగమించి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ( Knight Frank ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో అంటే 2019 జూలై నుండి డిసెంబర్ వరకు తీసుకుంటే, హైదరాబాద్‌లో లీజులకు ఇచ్చిన మొత్తం ఆఫీస్ స్థలం సుమారు 8.9 మిలియన్ చదరపు అడుగులు (89 లక్షల చదరపు అడుగులు), ఇది అంతకుముందు ఏడాదితో ఇదే కాలవ్యవధితో పోలిస్తే రెట్టింపు. గత ఆరు నెలల్లో సరఫరా నాలుగు రెట్లు పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది.
2019 పూర్తి సంవత్సరానికి, హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ సుమారు 12.8 మిలియన్ చదరపు అడుగులు (128 లక్షల చదరపు అడుగులు) లావాదేవీలు జరిపింది. గతేడాదితో పోలిస్తే 82 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇదొక రికార్డుగా నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఆఫీస్ స్పేస్ విషయంలో ప్రధాన డిమాండ్ ఐటి, ఐటిఇఎస్ కంపెనీల నుండే వస్తుందని పేర్కొంది. గత ఆరు నెలల్లో లీజుకు తీసుకున్న మొత్తం స్థలంలో 58 శాతం ఐటి / ఐటిఇఎస్ (IT/ ITeSసెక్టార్ల భాగస్వామ్య ఉంది.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఐటీ మంత్రిత్వ శాఖ
Hyderabad sets an all time office space absorption record#HappeningHyderabad #TrailBlazerTelangana pic.twitter.com/fuWzv40VTz
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 8, 2020
నగరంలో వేగంగా విస్తరిస్తున్న ఐటీతో పాటు, ఆఫీస్ స్పేస్ విషయంలో దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ తక్కువ ధరకే లీజుకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ అధికంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో పాటు మరో కంపెనీలతో పాటు కూడా ఆఫీస్ స్పేస్ పంచుకుంటూ ఖర్చులను చెరిసగం భరించే వెసులుబాట్లకు కూడా నగరం అనుకూలంగా కనబడుతుంది.
నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ మరియు ఎండి షిషీర్ బైజల్ ఇండియా రియల్ ఎస్టేట్ పనితీరు మరియు పురోగతిపై తమ అర్ధ-వార్షిక నివేదిక విడుదల చేశారు. ఇందులో దేశంలోని 8 ప్రధాన నగరాలలో నివాస మరియు కార్యాలయ మార్కెట్ పనితీరుపై గత 6 నెలల కాలానికి గానూ సమగ్ర విశ్లేషణను పొందుపరిచారు. నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాంచ్‌లు గతేడాది 150% పెరిగి 13,495 యూనిట్లుగా నమోదు కాగా, ఆ ఏడాది రెండవ అర్ధభాగంలో ఏకంగా 375% భారీ వృద్ధి రేటు సాధించి, ఆరేళ్ల గరిష్టంతో 8,065 యూనిట్లు నమోదు చేసింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతాలలో అపార్టుమెంట్ల నిర్మాణాల్లో కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది.