Disha Accused Encounter Case: దిశ నిందితుల్లో ఇద్దరు మైనర్లు? హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ కేసులో లోతైన విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల కమీషన్, చివరగా ఏమని తేలుస్తుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠత
File image of four accused who killed in an encounter on Disha case | PTI Photo

Hyderabad, December 10:  దిశ హత్యాచారోదంతం (Disha Incident), నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీసుల ఎన్‌కౌంటర్‌ (Encounter) లో చనిపోయిన నలుగురు నిందితుల మృతదేహాలను హైకోర్ట్ ఆదేశాల మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురీకి మార్చారు. ఈ శుక్రవారం వరకు మృతదేహాలను భద్రపరచనున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ పై జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ పోలీస్ అకాడమీలోనే మకాం వేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం, వరుసగా దిశ పేరేంట్స్ మరియు నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఈరోజు ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను విచారించనుంది. మొత్తం ఎంత మంది పాల్గొన్నారు, వారి హోదా, గత అనుభవాలు ఏమిటి? అనే అంశాలను పరిశీలించనున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా గాయపడిన ఇద్దరు పోలీసులను కూడా NHRC ఇప్పటికే మూడు సార్లు విచారించింది. ఘటనాస్థలంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించిన అధికారులను సైతం హక్కుల కమీషన్ సభ్యులు విచారించారు. ఇప్పటికే పోలీసులు దిశ హత్యాచార ఘటనకు సంబంధించిన నివేదికను NHRCకి అందించారు. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహాన్ని కాల్చివేత తదితర అంశాలపై సమగ్రమైన వివరాలను నివేదికలో పొందుపర్చారు. నేడు, రేపు కూడా NHRC విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏరాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది.

 

ఆ నలుగురిలో ఇద్దరు మైనర్లు?!

 

దిశ హత్యాచారం కేసులో పోలీసుల ఎన్ కౌంటర్ లో చంపబడ్డ నలుగురు నిందితుల్లో ఎ1 మహ్మద్ ఆరీఫ్, ఎ2 జొల్లు శివ, ఎ3 జొల్లు నవీన్ మరియు ఎ4గా చింతకుంట చెన్నకేశవులు ఉన్నారు. వీరంతా 20 ఏళ్ల పైబడిన వారేనని అంతకుముందు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే వీరిలో ఇద్దరు ఎ3 మరియు ఎ4 నిందితులైన జొల్లు శివ, జొల్లు నవీన్ లు మైనర్లు (Minors)గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వీరి తల్లిదండ్రులను NHRC బృందం విచారించింది. ఈ సందర్భంగా మైనర్లైన తమ బిడ్డలను ఎలా చంపుతారని వారు NHRC బృందాన్ని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దీంతో మీ పిల్లల వయసును తెలిపే ధ్రువీకరణ పత్రాలు సమర్పించమని అడిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి ఆధార్ కార్డులు, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్లను సేకరించి NHRCకి అందజేశారు.

వాటి ప్రకారం ఒక నిందితుడి పుట్టిన తేదీ ఆగష్టు 15, 2002గా ఉంది దీని ప్రకారం అతడి వయసు ప్రస్తుతం 17 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. అయితే ఆధారు కార్డులో మాత్రం ఒక సంవత్సరం ఎక్కువగా 2001గా నమోదై ఉంది. అయినప్పటికీ మైనర్ కిందకే వస్తున్నాడు.

అలాగే మరో నిందితుడి పుట్టిన తేదీ అక్టోబర్ 04, 2004గా ఉంది. దీని ప్రకారం అతడి వయసు ప్రస్తుతం 15 సంవత్సరాల , 8 నెలలుగా ఉన్నట్లు అవుతుంది. ఇక లారీ డ్రైవర్లుగా చెప్పబడిన మరో ఇద్దరు నిందితులకు ఇంతవరకూ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేలింది.

తేదీలు వేర్వేరుగా ఉండటం, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వీరికి సంబంధించిన వాస్తవ వయసు ఎంత అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత NHRC ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఉత్కంఠత నెలకొని ఉంది. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో, ఎల్లుండి హైకోర్టులో ఈ ఎన్ కౌంటర్ అంశం విచారణకు రానున్నాయి.