Hyderabad, January 28: కరోనావైరస్ లక్షణాల అనుమానంతో ప్రతిరోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి నిర్ధారణ కోసం వచ్చే రోగుల తాకిడి ఎక్కువవుతుంది. ఇప్పటికే 60కి పైగా కరోనావైరస్ అనుమానితులు గాంధీ మరియు ఫీవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే ఇప్పటివరకు పరీక్షించిన అనుమానితులలో ఎవరికీ కూడా కరోనావైరస్ నిర్ధారణ కాలేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Health Minister Etela Rajender) స్పష్టంచేశారు.
ఏ ఒక్కరి రిపోర్ట్ కూడా పాజిటివ్ అని నివేదించబడలేదని ఆయన తెలిపారు. ఇలాంటి గంభీరమైన సమయాల్లో పత్రికలు మరియు మీడియా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Here's Minister's Statement:
None of the coronavirus suspects tested so far have the virus. Not a single case was reported positive. During the solemn time, the press and the media appealed for abstinence.
— Eatala Rajender (@Eatala_Rajender) February 7, 2020
కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే జరుగుతుండటంతో వైరస్ లక్షణాల అనుమానంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో గాంధీకి క్యూకడుతున్నారు. నిన్న గురువారం కూడా ఇద్దరు చైనీయులు గాంధీ ఆసుపత్రిలో చేరారు, కొన్నేళ్లుగా నగరంలోని ఒక సంస్థలో పనిచేస్తున్న ఈ ఇద్దరు గత నెల చైనా నుంచి తిరిగి వచ్చారు. నగరంలో ఉండే చైనీయులందరూ కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండటంతో ఈ ఇద్దరికీ కూడా నిన్న వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది.
మరోవైపు రాష్ట్రంలో మహామేడారం జాతర జరుగుతున్న సందర్భంగా, వైద్యాధికారులు జాతరకు వచ్చే ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 1.60 కోట్ల మంది జాతరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అంటువ్యాదులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతరకు వెళ్లే దారుల్లో అనేక గ్రామాల వద్ద అధికారులు సుమారు 42 ఆరోగ్య శిబిరాలు, 17 పరిధీయ శిబిరాలు, ఒక మెగా మరియు ఒక మినీ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే మేడారం వద్ద తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు.