Booster Dose in Telangana: బూస్టర్ డోస్ గురించి పూర్తి సమాచారం ఇదే, తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమైన బూస్టర్‌ డోస్‌ పంపిణీ
covid-19-vaccination (Photo-PTI)

Hyd, Jan 8: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పంపిణీని మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదటి డోసును స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్‌ అంజద్‌ ఖాన్‌ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏండ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోసు(Booster Dose in Telangana) వేస్తున్నారు. గతంలో తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తోనే వ్యాక్సిన్‌ తీసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 41.60 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో 8.32 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. వీరందరికీ బూస్టర్‌డోస్‌ (Booster doses against COVID ) వేయనున్నారు. అదేవిధంగా హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు కలిపి రాష్ట్రంలో 6.34 లక్షల మంది ఉన్నారు.

రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్‌ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బూస్టర్‌ డోసుతో ప్రయోజనాలు ఉన్నాయని, అర్హులంతా బూస్టర్‌ డోసు వేసుకోవాలని ఆయన (Harish rao) చెప్పారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో బూస్టర్‌ డోసు వేసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లలో 38 శాతం మందికి మొదటి డోసు వేశామన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు పొడిగింపు, కొత్తగా 1,673 మందికి కరోనా, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు

ఇక తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు వ్యాప్తి నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. 15–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించాలని తెలిపారు. అర్హులంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సంక్రాంతి రోజు గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లల్లో వారుండి పండుగ జరుపుకోవాలని సూచించారు.

బూస్టర్‌ డోసు అంటే..

నిర్దిష్ట డోసుల మేరకు టీకా తీసుకున్న తర్వాత దాన్నుంచి లభించే రక్షణ తగ్గుతోందని భావించినప్పుడు అదనంగా ఇచ్చే దానినే బూస్టర్‌ డోసు అంటారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్‌ డోసు ఇస్తున్నాయి. మన దేశంలో ప్రికాషనరీ (ముందుజాగ్రత్త) డోసుగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ టీకా వేస్తారు. రెండోడోసు తీసుకున్న 9 నెలలకు ఈ డోసు ఇస్తారు.

అలాగే గతంలో ఏ కంపెనీకి చెందిన టీకా రెండు డోసులు తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా వేస్తారు. మరొకటి తీసుకోకూడదు. ప్రికాషనరీ డోసుకు అర్హులైన లబ్ధిదారుల జాబితా కోవిన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు సంబంధిత వ్యాక్సినేషన్‌ కేంద్రంలోనే ఉండాలి. ఆ సమయంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తారు. డోసు వేసుకున్న రోజు మద్యం సేవించకూడదు. మాంసాహారం తినకూడదు.