Nalgonda November 06: భోజనం కోసం దిగిన ప్రయాణికులకు కుచ్చుటోపీ పెట్టి బస్సుతో సహా ఉడాయించారు ఓ ప్రైవేట్ ట్రావ్స్ బస్సు డ్రైవర్, క్లీనర్. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో ట్రావెల్స్‌ బస్సులోనే లగేజీ పెట్టి కిందకు దిగిన 64 మంది ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్‌, అందులో ఉన్న ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో జంప్ అయ్యాడు. డ్రైవర్ నిర్వాకంతో నార్కట్‌పల్లి ఫంక్షన్‌ హాల్‌లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. బాధితుల వద్దకు నకిరేకిల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు.

అస్సాంకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో జీవనం కోసం వలస వెళ్లారు. అక్కడి నుంచి స్వంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఏజెంట్‌ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలు దేరగా, కూలీలను మార్గం మధ్యలో నార్కెట్‌పల్లి భోజన హోటల్‌ వద్ద కూలీలను దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పిన డ్రైవర్, లగేజీతో సహా ఉడాయించాడు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు తాము మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.