Hyd, Dec 17: సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను కిమ్స్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ శాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి సీపీ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
డిసెంబర్ 4న పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ రాగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ వ్యవహారంలో పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. బన్నీతో పాటు పలువురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.