Hyderabad, May 14: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి, మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ కురిసే తేలికపాటి జల్లులతో కొంత ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అంచనా ప్రకారం ప్రకారం, రాగల రెండు, మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతోంది, దీనివల్ల వాతావరణంలో తేమ స్థాయిలు పెరిగి ఉక్కపోతకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొంది.
రాగల 24 గంటల నుంచి తెలంగాణలో వివక్త ప్రదేశాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం, 30 నుంచి 40 కి.మీ.ల మధ్య గాలులు, మరియు వడగళ్ళు సంభవించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. అయినప్పటికీ నగర ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాబోయే కొద్ది వారాల్లో రాష్ట్రంలోని ఉత్తర మరియు ఈశాన్య భాగాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనావేస్తుంది.