Hyderabad, AUG 02: బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 30.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 66శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.