Khammam, May 20: ఆరేళ్ల చిన్నారికి ఒక వింత సమస్య వచ్చింది. ప్రతి అరగంటకు ఒకసారి చిన్నారి కంటి నుంచి పేపర్ ముక్కలు, బియ్యం గింజలు వస్తున్నాయి. అసలు ఆ చిన్నారికి ఉన్న సమస్య ఎంటో తెలుసుకునేందుకు ఎందరు ప్రయత్నించినప్పటికీ నిర్ధారణకు రావడం లేదు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గార్ల మండలం పెద్ద కిస్తారం గ్రామానికి చెందిన ఆరేళ్ల భుక్యా సౌజన్య కుడి కంటి నుంచి బియ్యం, పత్తి గింజలు, కాగితం ముక్కలు వంటివి వస్తున్నాయి. గత మూడు నెలలుగా ఇలా జరుగుతున్నదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఆందోళన చెంది పలు కంటి ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించారు. అయితే ఆ చిన్నారి కంటి నుంచి ఇవి ఎందుకు వస్తున్నాయి అన్నది ఎవరూ సరిగా నిర్ధారించలేకపోయారు.
ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది pic.twitter.com/b7JTGuNnFV
— Namasthe Telangana (@ntdailyonline) May 20, 2023
కాగా, బంధువుల సూచనతో సౌజన్యను ఖమ్మంలోని మమతా జనరల్ ఆస్పత్రికి శనివారం తీసుకెళ్లారు. కంటి వైద్య నిఫుణుడు డాక్టర్ కే విజయ కుమార్‌తోపాటు పలువురు డాక్టర్లు ఆ బాలికను పరీక్షించారు. ఆమె కుడి కంటి నుంచి ప్రతి అరగంటకు బియ్యం, పత్తి గింజలు, కాగితం ముక్క వంటివి వస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు వారికి చెప్పారు. అయితే డాక్టర్లు పరిశీలించినప్పుడు ఆమె కంటి నుంచి ఏమీ రాలేదు. మీడియా ముందు మాత్రం ఆ చిన్నారి కంటి నుంచి నీలం రంగులో ఉన్న పేపర్ వంటిది బయటకు వచ్చింది.
మరోవైపు బాలిక సౌజన్య కంటి చూపుతోపాటు ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి మీడియాతో అన్నారు. ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. కంటి నుంచి వస్తువులు రావడం ఆశ్చర్యకరమని అన్నారు. వైద్య చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటిది జరుగలేదని చెప్పారు. బాలిక కంటి నుంచి వచ్చిన నీలం రంగు వస్తువును పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపుతామని చెప్పారు. అలాగే ఆ చిన్నారిని వైద్య పరిశీలనలో ఉంచేందుకు ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని ఆమె తల్లిదండ్రులకు సూచించినట్లు వెల్లడించారు.