CM Revanth Reddy Vs Jagadish Reddy (Photo-Video Grab)

Hyd, july 29: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం (CM Revanth Reddy Vs Jagadish Reddy) జ‌రిగింది. జ‌గ‌దీశ్ రెడ్డి హ‌త్య కేసుల్లో నిందితుడు అని సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపించారు.

ఈ చర్చ ( Debate on electricity bills)సంద‌ర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి సీఎం, మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ... తాను హ‌త్య కేసుల్లో నిందితుడిన‌ని నిరూపిస్తే ఇదే స‌భ‌లో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో.. మ‌ళ్లీ అక్క‌డికే వెళ్లాల‌ని అనుకుంటున్నాడు.

నాకు కూడా చంచ‌ల్‌గూడ జైలు జీవితం గుర్తుంది. తెలంగాణ ఉద్య‌మం కోసం జైలుకు పోయాం. ఆయ‌న‌కు (CM Revanth Reddy) చ‌ర్ల‌ప‌ల్లినే గుర్తు ఉంట‌ది మ‌ళ్లీ యాది చేసుకంటున్నాడు. సీఎం రేవంత్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌ల చేసిన‌ ప్ర‌తి అక్ష‌రం రికార్డుల నుంచి తొల‌గించాలి అని జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళుతున్నాయి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

నేను చాలెంజ్ వేస్తున్నా.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడిన‌ దాంట్లో ఒక్క‌టి నిరూపించినా.. అందులో ఒక్క‌టి రికార్డు చూయించినా నేను ఈ స‌భ‌లో ముక్కు నేల‌కు రాసి రాజీనామా చేసి పోతా.. రాజ‌కీయాల్లో నుంచి వెళ్లిపోతా..! త‌ప్ప‌ని నిరూపించ‌క‌పోతే కోమ‌టిరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేల‌కు రాయాలి.. ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. తాను త‌న చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నాన‌ని జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

నేను ఎక్క‌డా త‌ప్పు మాట్లాడ‌లేదు. ఉపేక్షించం అని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల‌ మంత్రి భ‌య‌పెట్టిస్తున్నారు. ఒక‌టి కాదు మూడు హ‌త్య కేసులు పెట్టారు త‌న‌పై అని జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మూడింటింలో కోర్టు నిర్దోషిగా తేల్చింది. తెలంగాణ ఉద్య‌మం కేసులు త‌ప్ప.. వేరే కేసులు లేనే లేవు. పెట్రోల్ బంక్ దొంగ‌త‌నం కేసు, మిర్యాల‌గూడ కేసు మీద హౌస్ క‌మిటీ వేయండి.. ఒక్క కేసు నా మీద ఉన్న‌ ముక్కు నేల‌కు రాసి రాజీనామా చేస్తాను. నిరూపించ‌క‌పోతే సీఎం, మంత్రి కూడా ముక్కునేల‌కు రాసి రాజీనామా చేయాలి అని జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని అన్ని రంగాల‌కు అద్భుతంగా విద్యుత్ ఇస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు.. వారు అద్భుతంగా ఇస్తుంటే తాము అబ‌ద్దాలు మాట్లాడుతున్న‌ట్లు వారు చెబుతున్నారు.. కానీ విద్యుత్ కోత‌ల‌పై హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్ర‌భుత్వం ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు.

Here's Videos

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోతే.. ప‌ది నిమిషాలు రాక‌పోతే స్వ‌యంగా నాకే ఫోన్లు వ‌చ్చేవి. ఈ క్ర‌మంలో సాయం లభిస్తుందని మేము హెల్ప్ లైన్ పెడితే.. ఆ హెల్ప్ లైన్ వాళ్ల మీద కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు. హెల్ప్ లైన్‌లో హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చివరికి జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు.. ఎక్కడైనా పోస్ట్ పెడితే ఆ ప్రాంతంలో విద్యుత్ సరి చేస్తారు కానీ, ఆ లైన్‌మెన్ ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి లేకుంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు అని జ‌గదీశ్ రెడ్డి తెలిపారు.

చివ‌ర‌కు గాంధీ భ‌వ‌న్‌లో కూడా క‌రెంట్ పోయింది. క‌రెంట్ పోయింద‌ని మాట్లాడ‌డం నేర‌మైతే.. క‌రెంట్ కోత‌ల‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి క‌రెంట్ అధికారుల‌తో ఫోన్లో మాట్లాడారు.. వారిపై కోపం చేశారు. మ‌రి ఆయ‌న మీద కేసు పెడుతారా..? ఇదేనా ప్ర‌భుత్వం న‌డిపే విధానం..? మెద‌క్ జిల్లాలో క‌రెంట్ కోసం ధ‌ర్నాలు చేస్తే హ‌రీశ్‌రావు చేయించిండు అంట‌రు. మేం చెప్తే అధికారులు వింటారా..? ఎంజీఎం, భువ‌న‌గిరి ఆస్ప‌త్రుల్లో క‌రెంట్ పోతే సెల్ ఫోన్ల లైట్ మ‌ధ్య వైద్యం చేస్తున్నార‌ని నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. క‌రెంట్ పోకున్నా వారు వార్త‌లు రాస్తున్నారా..? అని జ‌గ‌దీశ్ రెడ్డి నిల‌దీశారు.

రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా అని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి సంచులు మోసి జైలుకు పోయినప్పుడు నేను ఇక్కడే ఈ సభలో ఉన్నాన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి విద్యుత్ ప‌ద్దుల‌పై డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన స‌మాధానం సీఎం రేవంత్ ఇచ్చారు. సీఎం 20 నిమిషాలు మాట్లాడారు. న‌న్ను ఒక్క నిమిషంలో పూర్తి చేయాలంటే ఎలా..? డెమోక్ర‌టిక్‌గా ఎంత సేపైనా మాట్లాడొచ్చు అంటున్నారు. త‌మ‌రు ద‌య‌చేసి అవ‌కాశం ఇవ్వండి.. 10 నిమిషాలు ఇస్తే కంప్లీట్ చేయ‌గ‌లుగుతా 20 నిమిషాలు ఆరోప‌ణ‌లు చేస్తే 10 నిమిషాలైనా స‌మాధానం చెప్పాలి క‌దా..? అని జ‌గదీశ్ రెడ్డి ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ స‌త్య‌హ‌రిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదు అని ఆయ‌న పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. స‌త్య‌హ‌రిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్‌కు అడ్డు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు. దీనిపై జ‌గ‌దీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దొంగ‌త‌నం దొరికిపోయింది కాబ‌ట్టే రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు త‌డుముకుంటున్నార‌ని జ‌గ‌దీశ్ రెడ్డి నిల‌దీశారు. మా అధినేత‌ కేసీఆర్ హ‌రిశ్చంద్రుడే. రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు.. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డినే అని జ‌గ‌దీశ్ రెడ్డి గుర్తు చేశారు.

నేను విద్యుత్ విష‌యంలో నిజ‌నిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వ‌డివ‌డిగా స‌భ‌లోకి వ‌చ్చి నాకు అడ్డు త‌గిలారు. సీఎం స‌భ‌లో అడుగు పెట్ట‌గానే త‌ప్పుదోవ ప‌ట్టింది. కేసీఆర్ కాలు గోటికి మీరు స‌రిపోతారా..? కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొల‌గించండి.. స‌భ‌ను హుందాగా న‌డిపించాలి. స‌భ‌లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల మీరు ప్ర‌జల‌కు ఏం సందేశం ఇస్తున్న‌ట్లు అని జ‌గ‌దీశ్ రెడ్డి అధికార‌ప‌క్షాన్ని నిల‌దీశారు.