CM Revanth Reddy (Photo-X)

Hyderabad, Dec 16: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet) సోమవారం భేటీ కానున్నది. శాసనసభ ప్రాంగణంలోని అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం కానున్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై క్యాబినెట్‌ లో చర్చించి, ఆమోదించనున్నారు. రైతు భరోసా విధివిధానాలు, కొత్త రెవెన్యూ చట్టం ఆర్వోఆర్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ ఉండనున్నది. ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం.

వారంపాటు అసెంబ్లీ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.