Hyderabad Metro Rail Phase Two Plan: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు, 70 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు
Metro (File: Google)

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. ఈ వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి బయలుదేరే రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలో మీటర్ల మేర మెట్రోను పొడిగిస్తారు.

కారిడార్-4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ - ఎల్బీనగర్ - చాంద్రాయణగుట్ట - మైలార్‌దేవ్‌పల్లి మీదుగా విమానాశ్రయానికి ఈ మార్గం చేరుకుంటుంది.

కారిడార్-4లో భాగంగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు.

కారిడార్-5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. రాయదుర్గం-నానక్‌రామ్‌గూడ-విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఈ నిర్మాణం ఉంటుంది.

కారిడార్-6లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.