Hyd, June 22: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొదటగా పోలీసులు అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు. ఆ తర్వాత అమరవీరులకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అనంతరం అమరవీరులపై ప్రదర్శించిన ప్రదర్శనను సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు.
కొవ్వొత్తుల వెలుగులతో సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అమరుల నివాళి గీతంతో నివాళులర్పించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఎంపిక చేసిన ఆరుగురు అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ సత్కరించారు.
ఆహార భద్రతా కార్డు ఉంటేనే రూ.3 లక్షలు, తెలంగాణ గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలు, అర్హతలు ఇవిగో..
మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తులో అమరుల స్మారకం ఏర్పాటు చేశారు. రూ. 178 కోట్ల వ్యయంతో పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్‌తో ప్రమిద, దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మించారు. ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు. మొదటి 2 బేస్‌మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రదర్శనల కోసం స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్, రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మించారు.