Srisailam Fire Mishap: శ్రీశైలం విషాద ఘటన, డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
Telangana CM KCR | File Photo

Srisailam, August 21: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి​ కేంద్రం అగ్ని ప్రమాదంలో (Srisailam Power Plant fire accident) 9 మంది మరణించారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం (Rs 50 Lakh Ex-gratia) ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs 25 Lakh Ex-gratia ప్రకటించి అండగా నిలిచింది.అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు ప్రమాదం అనంతరం అత్యున్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (Chief Minister Chandrashekhar Rao) కీలక నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్‌ ఉత్పత్తి​ కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని రాష్ర్ట విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. విషాదం, ఒక్కరూ బతకలేదు, శ్రీ‌శైలం భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మృతి, అత్యంత దురదృష్టకరం అంటూ ప్రధాని ట్వీట్

ఈగ‌ల‌పెంట ద‌గ్గ‌ర జెన్‌కో ఆస్ప‌త్రిలో మృత‌దేహాల‌కు మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి, విప్ గువ్వ‌ల బాల‌రాజు, ఎంపీ రాములు, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్‌రావు నివాళుల‌ర్పించారు.స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న జెన్‌కో సిబ్బందిని మంత్రి అభినందించారు. రెస్క్యూ టీం చేసిన స‌హాయ‌క చ‌ర్య‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని పేర్కొన్నారు. అయితే ప్లాంట్‌లో ఏ మేరకు నష్టం జరిగిందే ఇప్పుడే అంచనా వేయలేమని మంత్రి వెల్లడించారు.

అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.