CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Nov 29: ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు (CM KCR Meeting With MPs) దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆహారధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికే కాకుండా.. యావత్‌ దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR ) అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, పార్లమెంటు వేదికగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో పండించిన వరిధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే ధర్నాలు చేయాలని సూచించారు. ఈ వానకాలంలో సాగవుతున్న వరి విస్తీర్ణం విషయంలో కేంద్రం పూటకోమాట మాట్లాడుతూ కిరికిరి పెడుతున్నదని విమర్శించారు. రాష్ట్రం నుంచి కేంద్రం 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించవలసి ఉండగా 60 లక్షల టన్నుల ధాన్యాన్ని (40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని పాతపాటే పాడుతున్నదని వివరించారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయసభల్లో నిలదీయాలని ఆదేశించారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం (యూనిఫాం నేషనల్‌ ఫుడ్‌గ్రెయిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ) కోసం డిమాండ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలను ఆదేశించారు.

రాష్ట్ర రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకొనే విషయంలో అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విడనాడాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ను, సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఎటూ తేల్చకపోవడంపై సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యాసంగి సీజన్‌ మొదలై, రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్న తరుణంలో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని తేల్చిచెప్పడం, మొత్తం ఎంత ధాన్యం తీసుకుంటారో చెప్పకుండా నాన్చివేత ధోరణిని ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉభయసభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరఫున గళమెత్తి, పోరాడాలని నిర్ణయించింది. వార్షిక ధాన్య సేకరణ క్యాలండర్‌ను విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ను సమావేశం అభినందించింది. ఎటూ తేల్చని కేంద్ర వైఖరిపై విస్మయం వ్యక్తంచేసింది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రైతులు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం వైఖరి రాష్ట్ర వ్యవసాయరంగానికి అశనిపాతంగా మారిందని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో పలువురు టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు.