Hyd, Feb 15: కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ (CM KCR visits Kondagattu Temple) దర్శించుకున్నారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. 100 కోట్లతో చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు.
సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు.
పొలంలో దిగి వరి నాట్లు వేసిన రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొండగట్టులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హనుమాన్ జయంతిని దేశంలోనే అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు.వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని, అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా కృషిచేయాలని సూచించారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధిపర్చాలన్నారు.
అంతేగాక కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్ల నిధులను (sanctions Rs 500 crore) కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం పరిసరాల్లో 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని చెప్పారు. తాను మళ్ళీ కొండగట్టుకు వస్తానని, ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.