Delhi, Aug 16: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఆగస్టు 14న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
అనంతరం ఆగస్టు 15న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తిన పర్యటనలో భాగంగా ఆపిల్, ఫ్యాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ,ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, నూతన పీసీసీ చీఫ్ వంటి అంశాలపై సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. అలాగే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీని, రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న
దీంతో పాటు తిరిగి చేరికలపై దృష్టి సారించనున్నారు సీఎం రేవంత్. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తాజా టూర్‌లో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై క్లారిటీతోనే సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. ఏదిఏమైన రేవంత్ హస్తిన టూర్ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఆశీస్తున్న వారు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు.