Hydeabad January 22: తెలంగాణలో దళిత బంధు(Dalit Bandhu) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) తెలిపారు. దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు(Dalit Bandhu) పథకం అమలు చేస్తామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకొని ఫిబ్రవరి 5లోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి నెల 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఇందులో నుంచి రూ.10వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందని అన్నారు.
ఫిబ్రవరి 5వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లోని అర్హులైన దళిత కుటుంబాల అందరికీ దళితబంధు పథకం అమలవుతుందని తెలిపారు. మార్చి నెల 7లోగా లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లను కలెక్టర్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. దళిత బంధు పథకం అమలుకు ఈ రోజు రూ.100కోట్లు విడుదలయ్యాయనీ, మరో రెండు మూడు రోజుల్లో రూ.12వందల కోట్లు విడుదల చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నీ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరువడం, జాబితాలు సిద్ధం చేయడం యూనిట్లను గ్రౌండింగ్ చేయడం తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బందు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులు, ప్రత్యేక అధికారులకు ముందుగానే స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. 2021 ఆగస్ట్ 16న హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం ఫలాలు దళితులు అందుకుంటున్నారని తెలిపారు.