Hyderabad, Nov 28: రెండు, మూడు నెలల నుంచి హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెర పడనున్నది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ (EC) నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ (Telangana Polling) గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
144 సెక్షన్ అమల్లోకి
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. టీవీలు, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ (మోడల్ కోడ్ మీడియా కమిటీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.