KCR on Congress: ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణలో ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారు చేతిలో కాంగ్రెస్ బతకదని తెలిపిన బీఆర్ఎస్ అధినేత
KCR

Hyd, April 24: తెలంగాణలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. మంగళవారం ఆయన టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ పార్టీ చీలిపోతుందనే వార్తలను తోసిపుచ్చారు.

కేసీఆర్‌ అంటేనే ఓ చరిత్ర అని, దానిని ఎవరూ తుడిపేయలేరని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న ఫ్రస్ట్రేషన్‌ కాంగ్రెస్‌లో కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడ వెనక ముఖ్యమంత్రి, ఆయన ముఠా ఉన్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఇక కనుమరుగేనంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంపై స్పం దిస్తూ.. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ కనుమరుగైందా? అని ప్రశ్నించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

జనగామల ఓ మహిళ బాంచెన్‌.. కాల్మొక్తా ధాన్యం కొనుండ్రని పోలీసుల కాళ్లు మొక్కుతోంది. దీన్ని దొరలపాలన అంటరా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల ఉండుడు దొరలపాలనా? ప్రపంచంలోనే ఎక్కడాలేని దళితబంధు తెచ్చింది దొరలపాలనా..? రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నోళ్లదా? రైతుబంధును పూలల్లో పెట్టి బ్యాంకుల్లో వేసింది మేము..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విరుచుకుపడ్డారు.

‘దొరపాలన, గడీల పాలన అంతం చేశామంటున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు’ అన్న ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానమిస్తూ ‘నేను దొరనా.. మా సామాజికవర్గాన్ని వెలమదొరలు అని పిలుస్తరు. ఐ యామ్‌ ప్రౌడ్‌ టూ బీ ఏ వెలమ దొర. ఐ డోంట్‌ థింక్‌ ఎనీథింగ్‌ ఫర్‌ దట్‌.‘1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పింది దొరలపాలనా? పేద విద్యార్థులకు 20 లక్షల చొప్పున ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇచ్చింది దొరల పాలనా? వృద్ధులకు 200 పెన్షన్‌ను రూ.2వేలు చేసింది దొరలపాలనా..? అన్నార్థులను ఆదుకున్నది దొరలపాలనా? కేసీఆర్‌ కిట్టు ఎవరన్నా ఇచ్చిండ్రా..? గర్భిణులకు న్యూట్రిషన్‌కిట్లు ఇచ్చి వాళ్లను ఫ్రీగా బస్సులో తీసుళకెళ్లి ప్రసవం చేయించి మందులన్నీ ఇచ్చి ఇంట్లోదించిన ప్రభుత్వాన్ని చూసినమా? బస్తీ దవాఖానలు పెట్టిన ప్రభుత్వాన్ని చూసినమా? ఇన్ని సేవలందిచడం దొరపాలన ఎట్లా అవుతది.? అడుగడుగునా మాది మానవీయ పాలన అని అన్నారు.  తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు, 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేసిన మందుబాబులు

ఢిల్లీ మద్యం స్కాం.. నరేంద్రమోదీ సృష్టించిన కుంభకోణం అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రలో బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్‌ సంతోష్‌కుమార్‌ కీలక సూత్రధారి అని, అతడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం వల్లనే తనపై కక్ష గట్టారని చెప్పారు. నరేంద్రమోదీ 700 మంది ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తీసుకున్నారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను కూల్చారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి దొరికిపోయారు. వాళ్లను పట్టుకొని జైల్లో ఉంచాం. దీంట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కుమార్‌ మూల సూత్రధారి. బీజేపీ సెంట్రల్‌ ఆఫీసులో ఉండే ఆయనను అరెస్ట్‌ చేయమని పోలీసులను పంపించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షతో నా కూతురు మీద అనవసరంగా కేసు పెట్టారు. అరెస్ట్‌ చేశారు. ఆడపిల్ల అని చూడకుండా నిర్బంధించి ఎన్నికల ముందు అరెస్ట్‌ చేశారు. దీని ద్వారా కేసీఆర్‌ను అపఖ్యాతి పాలు చేయవచ్చు అని బీజేపీ అనుకున్నది. దాని ఫలితం అనుభవిస్తారు. తెలంగాణ ప్రజలు చూపిస్తారని తెలిపారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేతిలో మూడుసార్లు పరాభవానికి గురై అతని మీద గెలిచే శక్తి లేక అతన్ని స్కటిల్‌ చేయడానికి, అతని క్యారెక్టర్‌ అసాసినేట్‌ చేయడానికి, ఇక్కడ మమ్ముల కూడా ఇబ్బంది పెట్టడానికి కేజ్రీవాల్‌ను, కవితను అరెస్ట్‌ చేశారు. మాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం, నమ్మకం ఉన్నాయి. ఫైట్‌ చేస్తున్నాం. అరవింద్‌ కేజ్రీవాల్‌, కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. నాకు విశ్వాసం ఉందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు వసతులు, వనరులను వాడుకోలేని దద్దమ్మలు, అవివేకులు, తెలివి తక్కువవాళ్లు అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన్నాడు 7,700 మెగావాట్ల కరెంటు ఉండేదని, దిగిపోయేనాటికి 19,100పైగా మెగావాట్లు.. మొన్న ఎన్టీపీసీ అందుబాటులోకి రావడంతో 20,000 మెగావాట్లు దాటిందని, తొమ్మిదేండ్లు నిరాటంకంగా వచ్చిన కరెంటు కేసీఆర్‌ పక్కకు పోగానే కటక బంద్‌చేసినట్టు కరెంటు ఎందుకు పోయిందని నిలదీశారు. మంచినీళ్లు ఎందుకు రావడంలేదు, ఎందుకు సాగునీళ్ల ఇబ్బంది వచ్చిందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పాలకుల అసమర్థత, అవగాహన లేమికి నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి కరెంటు షార్టేజ్‌ 2,700 మెగావాట్లు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌ వినియోగం ఆధారంగా ఆనాటి విద్యుత్‌ ఉత్పత్తిలో పదేండ్ల్లపాటు 53.89 శాతం తెలంగాణకు, 46.11శాతం ఏపీకి కరెంటు ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా ఏపీ ఉల్లంఘించింది. ఏపీ చట్టాన్ని ఉల్లంఘించగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడు మండలాలను ఏపీకి ఇవ్వడమే కాకుండా 400 మెగావాట్ల సీలేరు పవర్‌ప్లాంట్‌ను కూడా ఏపీకి ఇచ్చారు.

దీనిపై మేము పోరాటంచేస్తే కేంద్రం పట్టించుకోలేదు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలోని ఏన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో మా వాదనను ఆనాడు పట్టించుకోలేదు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్‌ కూడా ఇవ్వలే. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అంధకారమవుతుందని చెప్పారు. ఇది కూడా ఓ చాలెంజ్‌ మాకు. రాష్ట్రంగా మేము నిలదిక్కుకోవాలి.

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొందరు తెలంగాణలో గెలిచారు. ఇయ్యాల రాష్ర్టానికి ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీలోని వాడే. కరెంటు ఇవ్వాలంటూ అతను అసెంబ్లీలో గోల.. నానా హంగామా. దీంతో కరెంటు కొనక తప్పని పరిస్థితి. ఈ రాష్ట్రం నేషనల్‌ గ్రిడ్‌లో లేనందున ఎక్కడినుంచంటే అక్కడినుంచి కొనే అవకాశం లేదు. మనం సదరన్‌ గ్రిడ్‌లో ఉన్నాం. సదరన్‌ గ్రిడ్‌ నుంచి కొనాలంటే ఇక్కడ కరెంటు లేదు. దీంతో తెలంగాణను నేషనల్‌ గ్రిడ్‌లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. వార్ధా-డిచ్‌పల్లి, అంగుల్‌-పలాస, వరంగల్‌-వరూర లైన్లను కలిపితేనే నేషనల్‌ గ్రిడ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మల్ల రెండు రాష్ర్టాలను కలిపేస్తాం..బెర్లిన్‌ గోడలను బద్దలు కొట్టి ఐక్యం కాలేదా.. అనే వాదనలు వినిపించాయి. వీళ్లని నల్లిఫై చేయాలంటే మనం నిలదొక్కుకోవాలి అనే సంకల్పంతో, పరిశ్రమలను ఆకర్షించాల.. రియల్‌ ఎస్టేట్‌ను పెంచాల అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేశాం. ఇండియాలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలోనే కరెంటు లభ్యత ఉంది. అయినప్పటికీ కరెంటు ఉన్నా ఇవ్వలేని గందరగోళ పరిస్థితి ఉండేది. డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం కూడాసరిగా లేదు. దీనికి రూ. 12000కోట్లు అవసరమవుతుందని ఇంజినీర్లు చెబితే వెంటనే చేయమని చెప్పాను. మేము జూన్‌లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ చివరి వరకు వ్యవసాయరంగం మినహా అందరికీ 24 గంటల కరెంటు ఇచ్చాం. అంతా ఎంతో ఆశ్చర్యపోయారన్నారు.

కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తును తానే భూస్థాపితం చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు. కడియం శ్రీహరికి డబ్బు లు ఇచ్చారా? లేదా? అనేది ఏ రాజకీయ పార్టీ చెప్పదు. ఇది పొలికటికల్‌ వ్యవహారం. ఇది రెగ్యులర్‌ ప్రాసెస్‌. శ్రీహరి అనే వ్యక్తి ఓడిపోయి ఇంటికాడ ఉంటే.. నేనే పిలిచి ఆయనను ఎంపీగా గెలిపించిన. ఆయనతో ఇక్క డ అవసరం ఏర్పడిందని, ఆయన సీనియర్‌ అని, రాజీనామా చేయించి, మళ్లీ బై ఎలక్షన్లలో గెలిపించి, ఎమ్మెల్సీని చేసిన. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని చేశాను. ఒక రాజకీయ పార్టీ అంతకంటే ఎక్కువ ఏ పదవి ఇస్తుందన్నారు.బీఆర్‌ఎస్‌ ఒక మహాసముద్రం. వందల మంది ఎమ్మెల్యేలను, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలను, పదుల సంఖ్యలో ఎంపీలను, డజన్ల కొద్ది జడ్పీ చైర్మన్లను, డీసీసీబీ చైర్మన్లను, వేల సంఖ్యలో సర్పంచ్‌లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సింగిల్‌ విండో చైర్మన్లను సృష్టించిన ఒక మహాసముద్రం బీఆర్‌ఎస్‌ అని అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు.సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదని, అక్కడ బీఆర్‌ఎస్‌ గెలవబోతున్నదని పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో ఏమి జరిగినా మాకు సంబంధం లేదు. చంద్రబాబు గెలిచినాక జగన్‌ గెలిచినా మాకు బాధలేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం.. మళ్లీ జగన్‌ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత ఎన్నికల్లో కలుగజేసుకోవడం లేదు. భవిష్యత్తులో పరిశీలిస్తాం.

పార్టీ పేరు మార్పుపై మాట్లాడుతూ..మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచన లేదు. అది సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్‌ దగ్గర ఒక పార్టీ పేరు రద్దు అయిన తర్వాత ఐదేండ్ల వరకు దానిని ఫ్రీజింగ్‌ చేస్తుంది. మళ్లీ పార్టీ పేరు మార్చే ఆలోచన లేదన్నారు.

18 రోజుల్లోనే రూ. 700 కోట్ల బీర్లు తాగేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ బాకా, కాకా చానళ్లు, కొన్ని విషం చిమ్మే పత్రికలు నేను అధికారంలో ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే ప్రజలను తాగుబోతులు చేస్తున్నరని అన్నరు. ఇప్పుడు బీర్ల అమ్మకాలు పెరిగితే ఎండతాపం వల్ల ప్రజలు తాగుతున్నరు అని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.