KCR (Credits: T News)

Hyderabad, SEP 15: రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ) చదువుకునే విద్యార్థినీవిద్యార్థుల కోసం సీఎం అల్పాహార పథకం (Cm Breakfast Scheme) ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు చక్కటి బోధనతో పాటు పోషకాహారం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచడంలో ఈ పథకం ఎంతగానో దోహదపడనుంది. ఉదయాన్నే వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని (Cm Breakfast Scheme) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

కాగా తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం’ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీవలే పంపించారు. తమిళనాడు వెళ్లిన అధికారుల బృందం.. అక్కడ పథకం అమలవుతున్నీ తీరుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అలాగే తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే విద్యార్థులకు అల్పాహారం పథకం అమలు చేస్తున్నారనే విషయాన్నీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లింది. అయితే విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన కేసీఆర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకే కాకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు ₹400 కోట్ల అదనపు భారం పడనున్నది.