Tamilisai Soundararajan (Photo Credits: ANI)

Hyd, Mar 7: నన్ను ఎవరూ భయపెట్టలేరని, దేనికి నేను భయపడనని మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహిస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని తమిళిసై అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సమావేశాలు జరిగితే కొత్త సెషనే అవుతుందన్నారు. కానీ ప్రభుత్వం పాత సెషన్‌కు కొనసాగింపు అని చెబుతుందన్నారు. ఫైనాన్స్‌ బిల్లు తీసుకొచ్చినప్పుడు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందన్నారని, ఆ తర్వాత సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఫైనాన్స్‌ బిల్లును సిఫారసు చేశానన్నారు.

రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు, రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

గవర్నర్ ప్రసంగం అనేది గవర్నర్ ఆఫీస్‌కు సంబంధించిన అంశం కాదన్న తమిళిసై.. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలే ఉంటాయన్నారు. గత ఏడాది సాధించిన విజయాలు.. ఈ ఏడాది చేయబోయే అంశాలు మాత్రమే ఉంటాయన్నారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సిన అవసరముందన్నారు.

ఈ నెల 8 మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై ప్రకటించారు. మరోవైపు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు మార్చి 8న మహిళా ఉద్యోగులకు సెలవ్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.