Rain Alert Again: తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
Heavy Rain Alert In Telangana Over Next 2 Days (photo-file image)

Hyderabad, October 14: తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని వణికిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఈ వర్షాల ధాటికి అతలాకుతలమైపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే మళ్లీ వర్షాలు వచ్చేస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు.

ఉపరితల ఆవర్తనానికి తోడు క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 7 వరకు హైదరాబాద్ గోల్కొండలో అత్యధికంగా 2.2 సెం.మీలు, మూసాపేటలో 2.0 సెం.మీ., శేరిలింగంపల్లి పరిధిలో 1.9 సెం.మీలు, ఖైరతాబాద్‌లో 1.8సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మరో నాలుగు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని రోజుల నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటుంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి దట్టమైన మబ్బులు వచ్చేస్తున్నాయి. క్షణాల్లోనే భారీ వర్షం పడుతోంది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.