
Hyderabad, October 22: తెలంగాణలో ఎప్పట్నించో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు (Telangana Muncipal Election 2019) సంబంధించి కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (High Court of Telangana) మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా జరగడం లేదని దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్ట్ కొట్టివేసింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్ట్ తోసిపుచ్చిందింది. ఈ సందర్భంగా చట్టబద్ధంగా ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది.
రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇందులో సిద్దిపేట మరియు అచ్చంపేట పురపాలకుల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. అలాగే 13 కార్పోరేషన్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మరియు గ్రేటర్ ఖమ్మం కార్పోరేషన్ల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో వీటిని మినహాయించి మిగతా వాటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పూర్తి చేస్తే 27 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇదివరకే హైకోర్ట్‌కు తెలియపరిచింది. హైకోర్ట్ తాజా తీర్పు నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది జూన్ నెలలోనే జరగాల్సి ఉండేవి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పక్షాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై విచారణ చేపడుతూ వచ్చిన ధర్మాసనం ఎట్టకేలకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతవరణం ఏర్పడునుంది.