Hyd, July 5: హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్, బాపూనగర్‌లోని సర్వే నంబర్లు 58, 59, 60లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల భూమి సేకరణ తర్వాత పరిహారం ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దశాబ్దాలు దాటినా మురికివాడల్లోని ప్రజల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది. 70 నుంచి 80 ఏళ్లు దాటిన వృద్ధులకు పరిహారం ఇవ్వకుండా ఇలా వేధించడం సరికాదని ధర్మాసనం మండిపడింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు అందుకున్నప్పటికీ ఉత్తర్వులను అమలు చేయడం గాని, లేదా అఫిడవిట్ దాఖలు చేయడం గాని చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అప్పటి హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, జీహెచ్‌ఎంసీ భూసేకరణ అధికారిగా ఉన్న వెంకటేశ్వర్లు, అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌లు ఆగస్టు 3న వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ధిక్కరణ నుంచి మినహాయింపు పొందడానికి, కోర్టు ఉత్తర్వులను ఇప్పటికైనా అమలు చేయడానికి మరో అవకాశం ఇస్తున్నామని వారికి తెలిపింది.
కేసు విషయానికి వస్తే..
హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్, బాపూనగర్‌లోని సర్వే నంబర్లు 58, 59, 60లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల సేకరణకు ప్రభుత్వం 1988లో నోటిఫికేషన్ జారీ చేసి.. భూసేకరణ చేపట్టింది. భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో మహేశ్ మోహన్‌లాల్, మరికొంత మంది హైకోర్టులో 2001లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి.. 4 శాతం వడ్డీ సహా పరిహారం చెల్లించాలని 2004 జనవరిలో తీర్పు వెలువరించారు. దీన్ని సవాల్ చేస్తూ అధికారులు దాఖలు చేసిన అప్పీలుపై విచారించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. 1988 నుంచి ఏడాది వరకు 4 శాతం వడ్డీ, ఆ తర్వాత చెల్లించేదాకా 15 శాతం వడ్డీతో పరిహారాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలంటూ గత ఏడాది జులై 13న తీర్పు వెలువరించింది.
మురికివాడల్లోని ప్రజల నుంచి భూమి లాక్కుని పరిహారం చెల్లించకుండా తిరిగి అప్పీలు దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. డివిజన్ బెంచ్ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో గత ఏడాది నవంబరులో మహేశ్ మోహన్‌లాల్, మరికొంత మంది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్లు వృద్ధులయ్యారని.. ఇంకా పరిహారం చెల్లించకపోవడాన్నిధర్మాసనం తప్పుబట్టింది. అధికారుల తరఫు న్యాయవాది వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.