Hyderabad, Jan 7: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో (Formula-E Car Race) కేటీఆర్ (KTR)కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విదేశీ కంపెనీకి చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ చేసిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో వాదనలు పూర్తి కావడంతో డిసెంబరు31న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం ఈ వ్యవహారంపై తీర్పు వెలువడనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఇదివరకే ఆదేశించింది. అయితే, దర్యాప్తు యథావిధిగా చేసుకోవచ్చని ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వెలువడే తీర్పు ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 10. 30 గంటల నుంచి 11 గంటల మధ్య తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఇదీ కేసు??
ఎన్నికల నియామవళి అమలులో ఉండగా క్యాబినెట్ అనుమతి లేకుండా, పరిపాలనా అనుమతి లేకుండా, రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకుండా విదేశీ కంపెనీకి విదేశీ మారకంలో రూ.46 కోట్లు చెల్లింపులు చేశారని, , కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు వచ్చి ఆయనపై కోర్టు కేసు కొట్టేస్తే ప్రభుత్వం ఏంచేస్తుంది? లేదా కేటీఆర్ పిటిషన్ ను కొట్టేస్తే పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తారా? అని రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.