Nalgonda, November 1: యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపూర్ వద్ద TIF-MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) శుక్రవారం ప్రారంభించారు. ఈ ఇండస్ట్రియల్ పార్కును తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) మరియు తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (TIF) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
రూ. 1,553 కోట్ల వ్యయంతో 482 ఎకరాల భూమిలో ఈ పార్కును నిర్మించారు. ఈ పార్కులో 450 కి పైగా పారిశ్రామిక యూనిట్లు కొలువు తీరనున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 19,000 మందికి మరియు పరోక్షంగా 30, 000 మందికి ఉపాధి లభించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
TIF-MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సింగిల్ విండో ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం, తెలంగాణ పారిశ్రామిక విధానంలో టీఎస్-ఐపాస్ దేశానికే ఆదర్శమని చెప్పారు. ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ ద్వారా 12 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లుగా తెలిపారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసిన వారే, నేడు తెలంగాణ విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా వాటిని పర్యావరణహితంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ఈ TIF-MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును కూడా పర్యావరణహితంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
పర్యావరణహితంగా గ్రీన్‌ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమలు తేవడమే కాదు వాటిని పర్యావరణహితంగా మారుస్తున్నాం. 482 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినా మరో 580 ఎకరాల స్థలం కావాలని కోరుతున్నారు. మొత్తం 2 వేల ఎకరాల వరకు పార్కును విస్తరించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. పూర్తిగా పర్యవరణహితమైన గ్రీన్ ఇండస్ట్రీనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.