Hyd, Dec 16: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... ఏ జిల్లాను రద్దు చేయబోమని, అసలు పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు.
ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళుతున్నారని, కానీ నిధులు తెచ్చారా? అని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం వద్దకు తరచూ నిధుల కోసం వెళ్లడం సాధారణ విషయమేనని, కానీ వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని గుర్తించాలన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు బీఆర్ఎస్ పాలించిందని, వారి హయాంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో అందరికీ తెలుసని విమర్శించారు. తమది పేదల ప్రభుత్వమన్నారు. పేదల కోసం అనునిత్యం పని చేస్తామన్నారు.
పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ (BRS) మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఫైర్ అయ్యారు. నేడు ఆ అప్పులను తీరుస్తూనే.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ (Congress Government) పేదల ప్రభుత్వమని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని మంత్రి పొంగులేటి అన్నారు.