CM KCR Press Meet: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం, దేశంలోని పరిస్థితులు, రాష్ట్రంలోని స్థితిగతులపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్, ప్రెస్ మీట్ సమగ్ర కథనం
CM KCR Press Meet | File Photo

Hyderabad, January 25:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో (Telangana Municipal Election Results 2020)  టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ  పథకాలు, తెరాస నేతల పనితీరు మెచ్చి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. కులం, మతం వివక్ష చూపని తమ సెక్యులర్ విధానాన్ని ఆమోదిస్తూ, అందరినీ కలుపుకునిపోండి, ఎవరి మాటలు వినొద్దు అని తెలంగాణ ప్రజలు నిర్ధేషించినట్లుగా ఈ గెలుపు సూచిస్తుంది అని కేసీఆర్ అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) శనివారం ప్రకటించారు.

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ అంశం దేశ సమగ్రతకు సంబంధించింది. అందుకు మేము (టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం) పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించాము. అయితే మతాల మధ్య గొడవలు సృష్టించేలా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లు (CAB)ను ఒక సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ (TRS) వ్యతిరేకిస్తుందని కేసీఆర్ అన్నారు.

దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో (Economic Crisis) ఉంటే దాని గురించి పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం మతాల మధ్య లేని గొడవలను సృష్టిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. రేపు భారత పౌరులు విదేశాలకు వెళ్లినపుడు, అక్కడి వారు భారతీయులను గెంటివేసే పరిస్థితి వస్తే అప్పుడెలా? అని ప్రశ్నించారు. ఊర్లలో అన్ని మతాల వారుంటారు, ఉదయం లేవగానే ఒకరిమొఖం ఒకరు చూసుకుంటారు. వారి మధ్య ధ్వేషం రగిలించడం ఎందుకని కేసీఆర్ అన్నారు

సిఎఎ (Citizenship Amendment Act) ను "100 శాతం తప్పు" నిర్ణయంగా పేర్కొన్న కేసిఆర్, త్వరలోనే కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదిస్తుందని చెప్పారు.

సిఎఎకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారానికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేసిఆర్ చెప్పారు.నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) లకు వ్యతిరేకంగా ఒకే తరహా ఆలోచనలతో ముందుకెళ్లే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలతో హైదరాబాద్ లోనే సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక ఎన్నికల్లో విజయంపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘనవిజయం లోకల్ బాడీస్ కు ఎక్కడా లభించదు, డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3/4 మెజారిటీ మొదలుకొని, పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు, స్థానిక సంస్థల్లో 32 జెడ్పీలకు 32 టీఆర్ ఎస్ గెలివడం భారతఏశంలో ఒక రికార్డ్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్. నా అనుభవంలో ఎన్నో విజయాలు, ఎన్నో ఎదురు గాల్పులు చూశాను. కానీ వరుసగా, స్థిరంగా ఇంతటి ఘన విజయాలు రావడం తొలిసారి చూస్తున్నా. ప్రజలు ఇంతకంటే ఇంకేం ఇవ్వాలి? ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం, గెలిచిన మాత్రాన గర్వాన్ని ప్రదర్శించం, టీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోకూడదు అని తెరాస అధినేత పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు కోర్టు కేసులతో ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నించాయి. పట్టణాల్లో, నగరాల్లో పాలన జరగకుండా ఇబ్బంది కలిగించాయి. తమపై ఎన్నో రకాల దుష్ప్రచారం చేశాయి. జాతీయ పార్టీ నాయకులుగా చెప్పుకునే కొంతమంది వ్యక్తిగత నిందారోపణలు చేశారు, ఒకడు సీఎం ముక్కు కోస్తా అంటాడు. వారందరికీ ఈ ఫలితాల ద్వారా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని కేసీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని, డబ్బుతో గెలిచిందని కొంత మంది మాట్లాడతారు. అంటే తెలంగాణ ప్రజలు అమ్ముడు పోయినట్లా? ప్రజలను ఇట్లనే అవమానిస్తారా? మీరు గెలిస్తే అప్పుడేంది? కొంతమంది డబ్బున్న నేతలు ఖర్చు పెట్టుకున్నారు కావొచ్చు. పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ. 80 లక్షలు మాత్రమే అవి కూడా పార్టీ మెటీరియల్ పంపిణీ కోసం. విమర్శ మంచిదే, కానీ అడ్డదిడంగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మర్లేసి కొడతారు. ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నా అదే తీరు ప్రతిపక్షాలది. మేం రాక్షసుల్లా పనిచేస్తాం కాబట్టే తెరాసకు ఈ విజయం దక్కింది.

సోషల్ మీడియాలో తెరాస నేతలపై విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయం అంటేనే ప్రజలకు అసహ్యం కలుగుతుంది. రాజకీయ నాయకులు పేపర్ మీద కార్టూన్లయ్యారు. అది సోషల్ మీడియానా? 'యాంటీ సోషల్' మీడియానా? ఇష్టమొచ్చిన భాషలో మొరుగుతాం అంటే ఇక కుదరదు. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించే సంస్కారం ఉండాలి. 120 మున్సిపాలిటీలో 115 మున్సిపాలిటీలు తెరాసవే. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశ పెట్టిన 'ఎక్స్ ఆఫిషియో' ఓట్లను కలిపుకొని తెరాసకు 115 మున్సిపాలిటీలు దక్కే పరిస్థితి ఉంది.

పట్టణం రాష్ట్రంలో అనేక చోట్ల మాకు ఇలా రావడం గొల్పం. అప్పట్లో మద్య నిషేధం వల్ల ఎన్ టీఆర్ కాలంలో ప్రభుత్వంపై టాక్స్ పెంచడం వల్ల టీడీపీ ఓడిపోయింది. రేపట్నించి సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సీఎం హెచ్చరించారు.

 

కేటీఆర్ దావోస్ నుంచి దంచి కొడితే..

 

అయితే మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టణీకరణ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు సీఎం మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా గ్రామాల్లోని ప్రజలు పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. అడవులు నశించి, పట్టణాలు విస్తరిస్తున్నాయి. వాహానాలు పొగ, ఇతర కారకాల వలన నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దిల్లీలో కాలుష్యానికి కూడా కారణం అదే. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కూడా ఏడాదికి 5- 6 లక్షల మంది ప్రజలు వలస వస్తున్నారు.

'మంత్రి కేటీఆర్ దావోస్ పోయి దంచి కొట్టి ప్రచారం చేస్తే, ఇప్పుడు దేశం చూపంతా హైదరాబాద్ పై పడింది, హైదరాబాద్ లో జనాభా పాపం పెరిగినట్లే పెరిగిపోతుంది. ఇప్పుడు అదనంగా వచ్చే వారికి వనరులను ఎలా ఉపయోగించాలి, నీటి సరఫరా ఎలా చేయగలం? ఐటీ సెక్టార్, ఇండస్ట్రీయల్ పెరుగుతుంది కానీ ఛాలెంజెస్ తో కూడుకున్న వ్యవహారం అది. అడ్వాంటేజ్ ఉన్నా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సంతోషించాలా? ఆ క్రమంలో డిసట్వాంటేజెస్ కూడా ఉన్నాయని బాధపడాలా? మన పరిస్థితి ఏంటో కూడా చూసుకోవాలి కదా?' అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అదృష్టం కొద్దీ హైదరాబాదు చుట్టూ అటవీభూమి ఉంది, ఆ సంపదను మనమంతా కాపాడుకోవాలి, 'సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి, జాతీయ స్థాయి నిపుణులతో ఆ ప్రతికూలతలపై అధ్యయనం జరిపిస్తాం అని సీఎం పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాల తరహాలో త్వరలో 'పట్టణ ప్రగతి' చేపడతామని చెప్పారు.

ఇక ఆ తర్వాత 57 దాటిన వారికి మార్చి 31 నుంచి వృద్ధాప్య పెన్షన్, ఉద్యోగులకు రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు, ఆర్థికంగా కష్టంగా నడుస్తున్నా పీఆర్సీ ఎంతో కొంచెం పెంచుతాం అని సీఎం స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం పనిచేస్తుందో కానీ, జాతీయ జీడీపీ దారుణంగా పడిపోతుంది. కేంద్రం ఏది దాచి పెట్టినా 'కాగ్ రిపోర్ట్' అన్నింటినీ బట్టబయలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పనితీరుతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అది రాష్ట్రాలకు భారంగా పరిణమించింది. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రతీ ఏడాది 21 శాతం ఆర్థిక పురోగతి సాధించగా, ఆర్థిక మందగమనం కారణంగా 1 శాతానికి పడిపోయింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెరుగుదల కారణంగా ప్రస్తుతం 9 శాతం ఆర్థిక పురోగతి కనిపిస్తుందని సీఎం అన్నారు.

ఇక రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని ఖచ్చితంగా, కఠినంగా అమలు చేస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే తీర్మానం ప్రవేశ పెడతామని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు. అవీనీతి చేస్తే నేతల పదవులు కూడా పోవడం ఖాయమేనని కేసీఆర్ హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులను 'తొలగించము' అని స్పష్టం చేశారు, దుష్ప్రచారాలు నమ్మొద్దు.  అయితే రెవెన్యూ ఉద్యోగులు తమని తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంత కడుపుమండితే రైతులు పెట్రోల్ డబ్బాలతో వస్తారు? అవినీతిలో నెంబర్ 1 రెవెన్యూ శాఖ అని ఏసీబీ చెప్పింది. అంతులేని అవినీతి ఎందుకు ? మంచి మాటతోని పోదు. రెవెన్యూ యాక్ట్ అమలు కోసం ఎవరికీ బయపడం, పేదరైతుల పొట్టకొట్టొద్దు, మొత్తం ఆన్ లైన్ సిస్టం అవుతుంది, ఏ రోజు అనుమతులు ఆరోజే జరిగిపోవాలి, ఒక్కరోజు కూడా ఆలస్యం అవ్వకూడదు. రెవెన్యూ ఉద్యోగులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పనులు వారు చేస్తారా? లేదా వేరే శాఖకు అప్పగించాలా? అనేది వారితోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

'Each One- Teach One' విధానంలో గ్రామ పంచాయితీలలో సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలో అందరికీ విద్యను అందించేలా చూడటం వారి బాధ్యత. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేలా, ఒక్క ఏడాదిలో నిరాక్షరాస్యతను రూపు మాపేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.

మనుషులు మృగాలుగా మారకుండా నైతిక విలువలతో కూడిన పాఠ్యాంశాలు చేరుస్తామని చెప్తూ ఇలా అనేక అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.