Hyderabad, January 25: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు (Telangana Municipal Election 2020 Results) కొనసాగుతోంది. ఊహించిన విధంగానే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ (TRS) కారు స్పీడ్ మీద ఉంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో టీఆర్ఎస్ పార్టీ రెబెల్స్ గెలుపొందారు. 16 వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించగా కేవలం 4 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు పోటీగా 700 చోట్ల రెబెల్స్ పోటీకి దిగారు. ఇక ఇది మినహా అన్ని మున్సిపాలిటీలో గులాబీ పార్టీ హవా కొనసాగుతుంది. కేవలం కొన్ని డివిజన్లకు మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు పరిమితమవుతున్నాయి.
మధ్యాహ్నం 12:15 ఫలితాల ప్రకారం... 120 మునిసిపాలిటీలకు ఇప్పటికే 92 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది, కాంగ్రెస్ 6 చోట్ల, బీజేపీ 1చోట విజయం సాధించింది. ఇక తొమ్మిది కార్పొరేషన్లకు గానూ 5 కార్పోరేషన్లను గులాబీ పార్టీ ఎగరేసుకు పోయింది.
Result Updates...
ఇక ఇటీవల ఘర్షణలు చెలరేగిన భైంసా మున్సిపాలిటీ ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ- ఎంఐఎం మధ్య హోరాహోరి నడుస్తుంది. భైంసా పరిధిలో ఇప్పటివరకు బీజేపీ 06, ఎంఐఎం 7 వార్డుల్లో గెలుపొందింది. మిగతా వార్డుల్లో కూడా రెండు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు నడుస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గల్లంతయ్యాయి.
కొంతకాలంగా టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరి మాటల యుద్ధం చేసుకుంటున్న నిజామాబాద్ జిల్లాలో తెరాస పైచేయి సాధించింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూర్, భీంగల్, బాన్సువాడ, బాల్కొండ అన్ని చోట్ల టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ఈ మున్సిపాలిటీని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.
సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు వ్యూహాలు పనిచేశాయి. హరీశ్ రావుపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు తెరాస ఖాతాలోకే వెళ్లాయి.
నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇక్కడ తెరాస 8, కాంగ్రెస్ 6 చోట్ల గెలుపొందాయి.
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీలో కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం విశేషం. అయితే పూర్తిస్థాయిలో ఆధిక్యం మాత్రం తెరాసదే.
మహబూబ్ నగర్ జిల్లాలోని అమన్ గల్ మున్సిపాలిటీలో బీజేపీ బోణి చేసింది. ఈ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాలతో తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు 5 చోట్ల గెలుపొందగా, తెరాస 3, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు.