Pox | Image used for representational purpose (Photo Credits: Twitter)

Hyd, July 25: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ (monkeypox in Telangana) కలకలం రేగిన సంగతి విదితమే. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు. తాజాగా, అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.

ఈ నేపథ్యంలోనే.. మంకీపాక్స్ (Monkeypox) గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శంక‌ర్ (Fever Hospital Superintendent Dr. Shankar )స్ప‌ష్టం చేశారు. ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్ శంక‌ర్ వెల్ల‌డించారు. బాధిత వ్య‌క్తి నుంచి న‌మూనాలు సేక‌రించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపించామ‌ని చెప్పారు. రేపు సాయంత్రానికి రిపోర్టు వ‌స్తుంద‌న్నారు.

తెలంగాణలో మంకీపాక్స్ కలకలం, కామారెడ్డి వ్యక్తికి లక్షణాలు, ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స, కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు

ఈ నెల 6వ తేదీన బాధితుడు కువైట్ నుంచి వ‌చ్చాడ‌ని తెలిపారు. బాధితుడు నీర‌సం, జ్వ‌రంతో ఉన్నారు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు వెళ్లారు. శ‌రీరంపై ఉన్న ద‌ద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండ‌టంతో ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని పేర్కొన్నారు. రోగికి ద‌గ్గ‌రగా ఉన్న ఆరుగురిని ఐసోలేష‌న్‌లో ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుంచి వ‌చ్చిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు.

ఇక భారత్‌లో ఇప్పటికే 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. కరోనా వైరస్ పట్ల తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే మంకీపాక్స్ ను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా జాగ్రత్తలు మంకీపాక్స్ నివారణలోనూ వర్తిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలని సూచించారు.

విదేశీ ప్రయాణాలు చేసిన వారు దీని బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారి పట్ల మంకీపాక్స్ ప్రాణాంతకం అయ్యే అవకాశముందని డాక్టర్ సురేశ్ కుమార్ వివరించారు. దీన్ని 99 శాతం నయం చేయవచ్చని తెలిపారు.