Hyderabad, OCT 15: పీఎఫ్ఐ (Popular Front of India) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కేరళ(Kerala), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాల్లో.. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై దాడులకు పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రణాళిక రచించిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ దాడులు జరిగే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. తెలంగాణలోనూ ఆర్ఎస్ఎస్ (RSS), విశ్వహిందూ పరిషత్‌తోపాటు (VHP) హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరిగొచ్చని.. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నాయి. పీఎఫ్ఐ (PFI) దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో.. తెలంగాణలో ఆర్ఎస్ఎస్(RSS), వీహెచ్ పీ(VHP), హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలెర్ట్ చేశారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఆ మేరకు తెలంగాణలోనూ పీఎఫ్ఐ (PFI) కార్యకర్తలు ఆర్ఎస్ఎస్‌ను (RSS) టార్గెట్ చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా అధికారులు సూచించారు. గత నెల ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు చేసి పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు.
విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పీఎఫ్‌ఐ ప్రతినిధులు.. మత ఘర్షణలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పీఎఫ్ఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
పీఎఫ్ఐ రహస్య ఎజెండాను అమలు చేస్తూ ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంది. పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. ప్రతీకారంగా పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు దిగే ప్రమాదముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ (central Intelligence) అధికారులు సైతం రాష్ట్రాలను అలర్ట్ చేశారు.