Hyd, July 7: తెలంగాణ రాష్ట్రంలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు పీఎఫ్‌ఐ(ఫాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరాటే శిక్షణ ముసుగులో ఓ మతస్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేలా మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారని సీపీ నాగరాజు వెల్లడించారు. చురుకైన, ఆవేశపరులైన యువతను పీఎఫ్‌ఐ ఎంపిక చేసుకుంటోందని తెలిపారు. సిమిపై నిషేధం విధించిన తర్వాత పీఎఫ్‌ఐ పుట్టుకొచ్చిందని.... ఈ సంస్థకు చెందినవారు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ సీపీ నాగరాజు వివరించారు.
నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులు.. షాదుల్లా, ఇమ్రాన్, మోబిన్ అరెస్టు చేశాం. వీరంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా యువతకు శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. కరాటే ముసుగులో కార్యకలాపాలు జరుపుతున్నారు. దాడులు చేయడం, అల్లర్లు సృష్టించడం ఈ ముఠా పని. ఈ ముఠాకు ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.
ఒక వర్గంలోని చురుకైన యువతను పీఎఫ్‌ఐ ఎంపిక చేసుకుంటోంది. మరో వర్గంపై వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారు. మానవ విస్ఫోటనంగా మార్చడమే ఈ శిక్షణ ఉద్దేశం. ఇతర వర్గాలపై దాడి, అవసరమైతే దేశాన్ని అస్థిరపరచడమే ఈ ముఠా లక్ష్యమని సీపీ నాగరాజు తెలిపారు.