Representational Image (Photo Credits: Pexels)

Hyd, July 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

సీఐ కరుణాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్‌ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్‌ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్‌ చేస్తున్న సింధు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఇది నచ్చని హరిలాల్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హరిలాల్‌ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది.

భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం మీద నుంచి దూకిన భర్త, కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరింపులు

వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మృతిచెందింది. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.