Hyd, July 13: తెలంగాణ రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు (telangana dh srinivasa rao) తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదైనట్టు చెప్పారు. అలాగే, సంగారెడ్డిలో 97, కరీంనగర్‌లో 84, ఖమ్మంలో 82, మేడ్చల్‌లో 55, మహబూబ్‌నగర్‌లో 54, పెద్దపల్లిలో 40 చొప్పున కేసులు నమోదైనట్టు చెప్పారు.
జూన్‌లోనూ 565 కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. . భద్రాద్రిలో 115, మలుగులో 113, భూపాలపల్లిలో నాలుగు, ఆసిఫాబాద్‌లో మూడు, నల్లగొండలో ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు. మే నెలలో మూడు చికున్ గున్యా కేసులు రికార్డయ్యాయన్నారు. ఈ నెలలో ఆరువేల విరేచనాల కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయన్నారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావం పెరుగుతోందని, సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పానీపూరి లాంటి వాటివల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ సీజనల్ వ్యాధిలా (seasonal diseases) మారిపోయిందని, అది కూడా జలుబు, జ్వరంలానే ఉండనుందని పేర్కొన్నారు. అయినప్పటికీ అందరూ టీకాలు వేసుకోవాలని గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. 50 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, తద్వారా కరోనా, క్షయ, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల బారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు 5 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలన్న డాక్టర్ శ్రీనివాసరావు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణులు ప్రసవం తేదీకంటే ముందే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.
ప్రజలు ‘ఫ్రై డే – డ్రై డే’ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి, ఆహారం వేడిగా ఉండేలా చేసుకోవాలని.. అదే సమయంలో గోరువెచ్చటి నీటిని తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలన్నారు. చిన్న నొప్పులే కదా అని తేలిగ్గా తీసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా.. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో గర్భిణులు వారం ముందే ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకోవాలన్నారు. బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వైద్యారోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలెట్ కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం డేటాను పరిశీలిస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వారికి హెల్త్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు.