Hyderabad, Oct 6: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీం (CM Breakfast Scheme) శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా (Rangareddy) మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్ లో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30కి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. శుక్రవారమే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్ఫాహారాన్ని వడ్డిస్తారు.
#Telangana Government To Launch Breakfast Scheme In Government Schools On 6th October.
CM's Breakfast Scheme Menu 👇 pic.twitter.com/lGkHt3Gk0N
— mukarram (@mukarram3) October 5, 2023
అలా తొలిరాష్ట్రం తెలంగాణే
ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని తొలుత తమిళనాడులో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తమిళనాడులో 1-5 తరగతుల విద్యార్థులకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో 1 -10 తరగతుల్లోని విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని పలు రాష్ర్టాల్లో 1 -8 తరగతుల వరకే అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నది. గత ఏడాది నుంచి బెల్లం కలిపిన రాగిజావను అందజేస్తున్నది. పదో తరతతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ సమయంలో ఉచితంగా స్నాక్స్‌ను ఏర్పాటు చేసింది.
సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..
- సోమవారం: ఇడ్లీ సాంబార్/ గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
- మంగళవారం: పూరి, ఆలు కుర్మా/ టమాటా బాత్, చట్నీ
- బుధవారం: ఉప్మా,సాంబార్/ కిచిడీ, చట్నీ
- గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ / పొంగల్, సాంబార్
- శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ/ కిచిడీ, చట్నీ
- శనివారం: పొంగల్, సాంబార్/వెజ్ పలావ్, రైతా/ఆలు కుర్మా