Hyderabad, June 15: నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రాబోయే నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, బంగాళాఖాతంలో జూన్ 11న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల మీదుగా వ్యాపించి ఉంది. గాలులు వీచే దిశను బట్టి అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల వరకు వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. నైరుతి రుతుపవనాలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆవరించి ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
ఇక, మంగళ- బుధవారాల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరభీమ్- ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనావేసింది.
కామారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవవచ్చు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.