Hyderabad, June 15 తెలంగాణలో సోమవారం మరో 219 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 5,193 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,744 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఎప్పట్లాగే హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 189 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి.
సోమవారం మరో ఇద్దరు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 187 కు పెరిగింది.
ఇదిలా ఉంటే, ఈరోజు అత్యధికంగా 389 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,766 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,240 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
ఇక మరోవైపు కోవిడ్ -19 నిర్ధారక పరీక్షలు మరియు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలను అనుమతించిన ఒకరోజు తరువాత, రాష్ట్ర ప్రభుత్వం మరో మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రైవేట్ ప్రయోగశాలలు మరియు కార్పొరేట్ ఆసుపత్రులకు ధరలను పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఎక్కువ బిల్లులు వేయకుండా, ముందుగానే కరోనా చికిత్సకు సంబంధించి అన్ని దశలలో చార్జ్ చేయాల్సిన ధరలను ప్రకటించింది.
ప్రభుత్వం అనుమతించిన ధరల చార్ట్ ప్రకారం, ప్రైవేట్ డయాగ్నొస్టిక్ ప్రయోగశాలలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షకు రూ. 2,200.
తేలికపాటి లక్షణాలు ఉన్న కోవిడ్-19 పేషెంట్ల నుండి ఐసోలేషన్ సౌకర్యాల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు రోజుకు రూ. 4,000 వసూలు చేయవచ్చు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మరియు వెంటిలేటర్ అవసరం లేని రోగుల నుండి రోజుకు రూ. 7,500 వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఇక పరిస్థితి విషమించి ఐసీయూ మరియు వెంటిలేటర్ మద్దతు రెండూ అవసరమయ్యే క్లిష్టమైన రోగుల నుండి రోజుకు రూ. 9,000 వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
పైన పేర్కొన్న ధరలు కేవలం చికిత్సకు సంబంధించినవి మాత్రమే వీటికి యాంటీవైరల్ డ్రగ్స్, ఇతర ఔషధాల వినియోగం కోసం వేసే ఛార్జీలు అదనంగా ఉండనున్నాయి.