Vjy, Sep 2: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది. వరద విలయానికి ప్రజాజీవనం స్తంభించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బీభత్సమైన వర్షం కురిసింది. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల భారీగా వరద ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లే బస్సులను రద్దు చేసింది.హైదరాబాద్ – విజయవాడ మధ్య 560కి పైగా బస్సులను రద్దు చేస్తూ టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. రద్దయిన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. పలు పాసింజర్ రైళ్లను కూడా రద్దయ్యాయి.